![]() |
తెలుగు సినిమా చరిత్రలో ఎస్వీ రంగారావు అంటే ఒక శిఖరం. ఆయన నటన, డైలాగ్ డెలివరీ ఒక పాఠం. అయితే ఆయన వ్యక్తిత్వం, క్రమశిక్షణ విషయంలో అప్పట్లో కొన్ని చర్చలు నడిచేవి. ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఆయన మద్యం సేవించి వస్తారనే విమర్శలు ఉండేవి. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే సూపర్ స్టార్ కృష్ణ 'పండంటి కాపురం' సినిమా కోసం ఎస్వీఆర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఉత్కంఠభరిత సంఘటన గురించి తెలుసుకుందాం.
'పండంటి కాపురం' సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఎస్వీఆర్ అయితేనే బాగుంటుందని కృష్ణ భావించారు. అయితే ఆయన వల్ల షూటింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది చెప్పినా, కృష్ణ మాత్రం "ఆ పాత్రను ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు" అని ఖచ్చితంగా చెప్పేశారు. ఒకరోజు శివాజీ గార్డెన్స్‌లో షూటింగ్ జరుగుతుండగా, ఎస్వీఆర్ మద్యం మత్తులో రాలేని స్థితిలో ఉన్నారని తెలిసింది.
కృష్ణ చెప్పడం వల్ల ప్రభాకర్ రెడ్డి, మాధవరావు కలిసి ఎస్వీఆర్‌ను తీసుకు రావడానికి వెళ్లారు. కానీ ఆయన మాత్రం "నేను రాలేనురా.. నన్ను వదిలేయండి" అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తోటి నటుడు గుమ్మడి, కృష్ణతో మాట్లాడుతూ.. "ఎందుకు ఈయనతో ఈ ఇబ్బందులు? ఈయన్ని పక్కన పెట్టి వేరే ఎవరినైనా చూసుకోవచ్చు కదా" అని సలహా ఇచ్చారు. కానీ కృష్ణ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ఈ మాటలు విన్న ఎస్వీఆర్ మేకప్ మేన్, వెంటనే వెళ్లి ఆయనకి విషయం చెప్పారు. తన గురించి యూనిట్‌లో ఇలా అనుకుంటున్నారని తెలిసి ఎస్వీఆర్ రోషం ఉడికిపోయింది. మరుసటి రోజు నేరుగా కృష్ణకి ఫోన్ చేసి, అప్పటివరకు తీసిన రష్ (ఫుటేజ్) చూస్తానని చెప్పారు. సినిమా చూసి బయటకు వచ్చాక కృష్ణతో ఒకే ఒక మాట అన్నారు.. "ఇప్పటివరకు తాగిన రంగారావుని చూశారు.. ఇప్పుడు తాగకుండా చేసే రంగారావు విశ్వరూపం చూస్తారు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు నన్ను తలుచుకుంటూ వెళ్లకపోతే అడగండి" అని సవాల్ విసిరారు.
చెప్పినట్టుగానే ఎస్వీ రంగారావు ఆ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా జమునతో ఉన్న సీన్స్, సెంటిమెంట్ పండించడంలో ఆయన చూపిన ప్రతిభ అమోఘం. తాగి ఉన్నా లేకపోయినా, కెమెరా ముందుకు వస్తే ఆయన పరకాయ ప్రవేశం చేస్తారని తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు చెప్తుంటారు. తనపై కృష్ణ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ పండంటి కాపురం చిత్రంలోని ఆ పాత్రకు జీవం పోసారు ఎస్వీఆర్. నటన పరంగా ఆయన కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలు రాయి అని చెప్పొచ్చు.
![]() |